జై భీమ్ టీవీ - జాతియం / : కర్నాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ అభ్యర్థి కుట్ర పన్నారంటూ ఆ పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించిన సంబంధిత ఆడియోను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా విడుదల చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. కర్ణాటకలోని కలబురగి జిల్లా చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియోను సూర్జేవాలా విడుదల చేశారు. ‘ఖర్గేతో పాటు ఆయన భార్య, పిల్లలను కూడా అంతమొందిస్తా’ అని రాథోడ్ కన్నడలో అన్నట్లుగా ఆడియోలో ఉంది. ఎన్నికల్లో ఓటమి భయంతో ఖర్గే కుటుంబ సభ్యుల హత్యలకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని సూర్జేవాలా ఆరోపించారు. కన్నడ ప్రజలు కాంగ్రెస్‌పై చూపుతున్న అభిమానాన్ని జీర్ణించుకోలేక చివరికి హత్యా రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని సూర్జేవాలా ఆరోపించారు. రాథోడ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, సీఎం బసవరాజ్ బొమ్మై అండదండలు కూడా ఉన్నాయని అన్నారు. తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను రాథోడ్ ఖండించారు. కాంగ్రెస్ చెప్తున్నవన్నీ అబద్ధమని, అది ఓ ఫేక్ ఆడియోగా కొట్టిపారేశారు. ఓటమి భయంతోనే లేని అభాండాలు మోపుతున్నారని ఆరోపించారు. చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తుండగా.. ఆయనపై 26 ఏళ్ల మణికంఠ రాథోడ్‌ను బీజేపీ బరిలో నిలిపింది. మే 10వ తేదీన కర్ణాటకలోని అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి
Admin