జై భీమ్ టీవీ - జాతియం / : నితీశ్ ఫ్రంట్ కు తెలంగాణలో నో టెంట్! ఇప్పటికే దూరమన్న బీఆర్ఎస్ వెనుకడుగు వేస్తున్న కాంగ్రెస్ ఎన్నికలకు ముందు సాధ్యం కాదన్న సీపీఎం ఈ నెల 12న మీటింగ్ వాయిదా బీజేపీ వ్యతిరేకంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేస్తున్న కూటమికి తెలంగాణలో టెంటు ఉండేలా కనిపించడం లేదు. తాము ఆ కూటమిలో ఉండబోమని బీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. పట్నాలో ఈ నెల 12న భావసారూప్యత కలిగిన పార్టీలతో సమావేశం నిర్వహించాలని నితీశ్ కుమార్ భావించారు. కలిసి వచ్చే అవకాశం ఉన్న పార్టీలకు ఆహ్వానం పంపారు. ఆ తేదీన రావడం కుదరదని కాంగ్రెస్, మరోపార్టీ తెలుపడంతో నితీశ్ ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే ఇది అత్యంత కీలక సమావేశమని, దీనికి పార్టీ అధినేతలే రావాలని షరతు పెట్టినట్టు నితీశ్ చెబుతున్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కార్యాచరణ ప్రకటిస్తామని నితీశ్ వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తానని శపథం చేసి, గత ఏడాది బీజేపీతో సంబంధాలను తెంచుకున్న నితీశ్ కుమార్.. ప్రతిపక్షాల ఐక్యత డ్రైవ్ లో భాగంగా చాలా మంది రాజకీయ ప్రముఖులతో మాట్లాడారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లతోనూ సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ చర్చలు జరిపారు. దీనిపై స్పందించిన ఏచూరి ఫ్రంట్ ఎప్పుడైనా ఎన్నికల తర్వాతే ఏర్పడుతుందని, ఎన్నికలకు ముందు సాధ్యం కాదని పేర్కొనడం గమనార్హం. కేరళలో తమకు కాంగ్రెస్ ప్రత్యర్థి అని దేశ వ్యాప్తంగా ఒకే నిబంధనను అప్లయ్ చేయలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం నితీశ్ ఫ్రంట్ లో చేరితే తాము కేరళ రాష్ట్రాన్ని కోల్పోవలసి వస్తుందని పరోక్షంగా చెప్పారు. దాదాపు సీపీఐ కూడా అదే వైఖరితో ఉన్నట్టు తెలుస్తోంది. మోడీని గద్దె దించడమే వ్యూహం కావద్దు మోడీని గద్దె దించడమే వ్యూహంగా ఫ్రంట్ ఏర్పడటం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల జాతీయ మీడియాకు చెప్పారు. జనతాదళ్ (యూ) సీనియర్ నాయకుడు త్యాగి ఇటీవల సీఎం కేసీఆర్ ను, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సంప్రదించి కూటమిలో చేరాలని విజ్ఞప్తి చేశారని కేటీఆర్ తెలిపారు. ఒక వ్యక్తి, పార్టీని అధికారం నుంచి దింపేందుకు ప్రతిపక్షాలను ఏకం చేయడంపై తమకు నమ్మకం లేదన్నారు. బీఆర్ఎస్ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు పోతున్నదని, తెలంగాణలో చేసిన అభివృద్ధిని దేశమంతా చేస్తామని వివరిస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని బట్టి రాజకీయం మారుతున్నందున థర్డ్, ఫోర్త్ ఫ్రంట్ ఫార్ములా ఇప్పుడు పనిచేయదని తాము భావిస్తున్నామని కేటీఆర్ చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ వెనుకడుగు వేస్తుండటం, సీపీఎం ఎన్నికల తర్వాతే ఫ్రంట్ లు ఏర్పాడాలని భావిస్తుండటాన్ని పరిశీలిస్తే.. నితీశ్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ఫ్రంట్ కు తెలంగాణ లో టెంట్ ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
Admin