జై భీమ్ టీవీ - జాతియం / : న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) సోమవారం వెల్లడించింది. నీట్-యూజీ కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఎన్‌ఎంసీ సెక్రెటరీ డాక్టర్ బీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన జారీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 710 వైద్య కాలేజీల్లోని సుమారు 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. వీటితోపాటు 21,000 బీడీఎస్ సీట్లతోపాటు ఆయుష్, నర్సింగ్ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మెర్‌లోని ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌కు ఆగస్టు 14 నుంచి 21వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన వారు ఆగస్టు 24 నుంచి 29వ తేదీలోపు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రెండో రౌండ్ కౌన్సెలింగ్ సెప్టెంబరు 5వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 13న సీట్లకు ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్ 14 నుంచి 20లోపు సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబరు 16 నుంచి 20 వరకు జరుగుతుంది. అక్టోబరు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన వారు సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీలోపు కాలేజీల్లో చేరాలి. ఈ మేరకు మొత్తం మూడు రౌండ్లలో కౌన్సెలింగ్ జరుగుతుంది. తెలంగాణలో 26 ప్రభుత్వ వైద్య కాలేజీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ నీట్ యూసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయి ర్యాంకుల వివరాలను ఎంసీసీ నుంచి సేకరించి, అందుకు అనుగుణంగా కౌన్సెలింగ్ తేదీలను సిద్ధం చేయనుంది. అనంతరం రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్లు చేపడుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత సీట్లను కేటాయిస్తారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ వైద్యకాలేజీలు, 30 ప్రైవేటు వైద్య కాలేజీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 8,490 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 26 ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 15 శాతం ఎంబీబీఎస్ సీట్లను జాతీయ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేస్తారు.
Admin