జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణకు వరాల జల్లు కురిపిస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. ప్రజలందరికీ సుపరిపాలన.. వెనుకబడిన వర్గాల సాధికారిత.. అందరికీ సమాన చట్టం వర్తింపు అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు భిన్నంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. ధరణి స్థానంలో మీ భూమి యాప్ తీసుకొస్తామని హామీ ఇచ్చింది. బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటినే జీతాలు వచ్చేలా చేయడంతో పాటు.. ఆరునెలలకోసారి గ్రూప్-1, గ్రూప్-2 సహా TSPSC రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామంటోంది. 6 నెలల్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై బలమైన వాదనలు వినిపిస్తామంటోంది. ప్రతి మండలంలో నోడల్ స్కూల్స్.. హైవేలు, ఇన్ఫోవేలు, రైల్వేలు, ఎయిర్‌వేల అభివృద్ధి.. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కేరిడార్ ప్రారంభానికి చొరవ.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు లాంటి హామీలను ప్రకటించింది. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామంటోంది. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై విచారణ.. రాజ్యాంగ విరుద్ధ రిజర్వేషన్ల తొలగింపు, ఎస్సీలకు సాధికారత.. తెలంగాణ గల్ఫ్ నివాసితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు చేస్తామంటోంది బీజేపీ. రైతులకు కేంద్రం ఇచ్చే ఎరువుల సబ్సిడీతోపాటు రూ.2500 ఇన్‌పుట్ సాయం.. రైతులకు ఉచిత పంట బీమాతో పాటు వరికి రూ.3100 మద్దతు ధర ఇస్తామంటోంది కమలం పార్టీ. టర్మరిక్ సిటీగా నిమాజాబాద్‌ను అభివృద్ధి చేయడమే కాకుండా.. పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామంటోంది. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కూడా బీజేపీ హామీల్లో ఒకటి. ఇక మహిళలు, విద్యార్థులనుపైనా వరాల జల్లు కురిపించింది. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు.. మహిళలకు 10లక్షల ఉద్యోగాల కల్పన.. ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు.. డ్వాక్రా సంఘాలకు 1% వడ్డీకే రుణాలు.. మహిళా రైతు కార్పోరేషన్.. ఇళ్లలో పనిచేసేవాళ్ల కోసం డొమెస్టిక్ వర్కర్స్ కార్పోరేషన్.. ఏడాదికి రూ.10లక్షల బీమా.. చేస్తామంటోంది. సింగరేణి ఉద్యోగులకు ఇన్‌కం ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్.. మేడారం జాతరకు జాతీయ హోదా.. హైదరాబాద్‌లో ORR బిడ్డింగ్‌పై దర్యాప్తు, బిడ్డింగ్‌పై పున:సమీక్ష.. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీయాత్ర.. లాంటి హామీలు కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నాయి.
Admin