జై భీమ్ టీవీ - జాతియం / : అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కి సంబంధం లేని ఎరుపురంగు రాజస్థాన్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఒక ఎమ్మెల్యే బయటపెట్టిన రెడ్ డైరీ, ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాల్లో ఒకటిగా మారింది. సినిమాను మించిన ట్విస్టులున్న ఈ రెడ్ డైరీ, ఈ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందా అన్నదే చర్చనీయాంశం అయింది. అసలే కాంగ్రెస్ వర్గపోరులో నలిగిపోతున్న రాజకీయాల్లో రాజేంద్రసింగ్ గుఢా అనే మంత్రి కలకలం రేపారు. అసెంబ్లీలో రెడ్ డైరీ అంటూ సంచలనం సృష్టించారు. అశోక్ గెహ్లాట్ సర్కారు లంచాల బాగోతం అంతా ఇందులో ఉందంటూ ఆయన దుమారం రేపారు. ఇదంతా కొత్త తలనొప్పిగా మారడంతో వెంటనే ఆయన్ను అశోక్ గెహ్లాట్, తమ కేబినెట్ నుంచి బహిష్కరించారు. అప్పటినుంచి బీజేపీ ఈ అంశాన్ని ఎంచుకుంది. ఎన్నికల ప్రచారాలతో మోదీ, అమిత్ షా వంటినేతలు ఈ అంశాన్ని వాడుకున్నారు. లాల్ డైరీలో ఏముందో బయటకు రానప్పటికీ, అవినీతికి అది కేరాఫ్ అనే ప్రచారాన్ని బీజేపీ చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ వాగ్బాణాల నుంచి అమిత్ షా సెటైర్ల వరకూ అన్నీ లాల్ డైరీ మీదనే కనిపించాయి. కాంగ్రెస్ అవినీతికి లాల్ డైరీ ప్రతీకగా మారింది. దీపావళికి కొనుగోలు చేసే డైరీల్లో అతి తక్కువ డిమాండ్ ఉన్నది ఎరుపురంగు డైరీలకే. శుభాకాంక్షలు చెబుతూ, ఎరుపురంగు డైరీ ఇస్తే, అది అవినీతికి ప్రతీకగా మారుతుందేమో అన్న భయం అందరికీ కలుగుతోంది. అయితే కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని మహదేవ్ యాప్ కుంభకోణానికి, లాల్‌డైరీకి కాంగ్రెస్ పార్టీ మిస్సింగ్ లింక్స్‌ని కలిపింది. ఈ రెండూ ఒకటేననీ, బీజేపీ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ఒకవేళ నిజమే అయితే, లాల్ డైరీ మీద దర్యాప్తు ఎందుకు జరగలేదన్నది అశోక్ గెహ్లాట్ వాదన. మహదేవ్ యాప్ మీద, లాల్ డైరీ మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసిన కుట్ర. రాయ్‌పూర్ పట్టుబడిన వ్యక్తి EDని, కేంద్రం కుట్రను బట్టబయలు చేశాడు. తనను తప్పుదోవ పట్టించారంటూ, పదిపేజీల లేఖ రాశారు అశోక్ గెహ్లాట్. తమకు సంబంధం లేదన్నారు. ఇక లాల్ డైరీ ఎక్కడిది? ED, ITలతో ఏం దర్యాప్తు చేశారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అన్న అంశాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ కాంగ్రెస్ కూడా లాజిక్ పాయింట్‌ను తెరమీదకు తెస్తోంది. కానీ చివరకు ప్రజలు అవినీతి అనే అంశంపై ఎలాంటి తీర్పు చెబుతారన్నది ఆసక్తిగా మారింది.
Admin