జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / కర్నూల్ జిల్లా : కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆ మహా శివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరిగింది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈరోజుతో కార్తీకమాసం ముగుస్తుండటంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లు కూడా కిక్కిరిసి పోయి ఉన్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ముందు రోజు అర్ధరాత్రి దాటిన తరువాతి నుండే ఇక్కడి పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీకమాసంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరమైన పాలు, బిస్కెట్లు, మంచినీళ్లు, అల్పాహారం వంటి సదుపాయాలను కంపార్ట్ మెంట్లలోనే సమకూర్చినట్టుగా ఈవో పెద్దిరాజు తెలిపారు. చివరి కార్తీక సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం చివరి కార్తీక సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక మాసంతం రేపు తెల్లవారుజాము వరకు ఉండటంతో రేపు కూడ శ్రీశైలంలో భక్తుల రద్దీ వుండే అవకాశం కూడ ఉంది
Admin