జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లో గత ఆరు నెలలుగా నకిలీ ఓట్ల పంచాయతీ నడుస్తోంది..అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పదేపదే ఆరోపణలు చేసింది.పలు నియోజకవర్గాల్లో ఓట్లు తీసేశారంటూ ఆధారాలతో సహా ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ సెంట్రల్, పర్చూరు నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల కమిషన్…ఓట్ల తొలగింపునకు కారణమైన అధికారులపై చర్యలు కూడా తీసుకుంది. ఇక బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా నకిలీ ఓట్లపై అనేక సార్లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా 60 లక్షల ఓట్లను చేర్చారని, అలాంటి వాటిని ఏరిపారేయాలని కోరింది. ఇక ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లను కలిగి ఉన్న వారి పైనా దృష్టి పెట్టాలని ఈసీని కోరారు వైసీపీ నేతలు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓట్లు ఉంటే వాటిని తొలగించాలని కోరారు వైసీపీ నేతలు. ఇలా రెండు ప్రధాన పార్టీలు నకిలీ ఓట్లు, ఓట్ల గల్లంతుపై వరుస ఫిర్యాదులు చేశాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇంటింటి సర్వే పూర్తి చేశారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఓట్ల తొలగింపుపై పగడ్బందీగా సర్వే ఓట్ల తొలగింపు ఆరోపణలతో ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వచ్చింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు పక్కాగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 21 నుంచి ఇంటింటి ఓటర్ సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓట్ల తనిఖీ చేపట్టారు. బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు ఆయా పార్టీల ఏజెంట్లు కూడా ఇంటింటికీ వెళ్లేలా అవకాశం కల్పించారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఎక్కడైనా ఓటర్లు ఉండీ, ఓటు లేనట్లయితే వారిని జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకున్నారు. బీఎల్వోలు ఆన్‌లైన్‌లో ఓట్లను చేర్చేలా దరఖాస్తు చేశారు. ఇదే సమయంలో ఎక్కడైనా ఓటర్ లేకుండా, ఓటర్ కార్డులు ఉంటే వాటిని తొలగించేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా సెప్టెంబర్ 21తో ఇంటింటి సర్వే పూర్తి కి డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ, అది పూర్తి కాకపోవడంతో కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల తనిఖీ పూర్తయింది. దీంతో తాజాగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. దీనికోసం అన్ని రాజకీయ పక్షాలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా సమావేశం ఏర్పాటు చేశారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాకి సంబందించిన సీడీలను అన్ని పార్టీలకు అందించిన తర్వాత వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు. ఓటు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే ఛాన్స్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన డోర్ టూ డోర్ ఓటర్ వేరిఫికేషన్ తో ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ రూపొందించింది. ఇప్పటికే ఓట్ల తొలగింపు, ఓట్ల నమోదుపై బూత్ లెవెల్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని జాబితా రూపొందించారు. అయితే రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఎక్కడైనా లోపాలుంటే మళ్లీ వాటిని సరిదిద్దేలా ఈసీ అవకాశం ఇస్తుంది. మరోవైపు ఒకటికంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారి విషయంలో కూడా ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునున్నట్లు సమాచారం. అర్హత ఉండీ, ఓటు లేనట్లయితే తిరిగి చేర్చేలా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఎన్నికల కోసం జనవరిలో తుది ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది.
Admin