జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కాస్త సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్నీ హామీలకు పదును పెడుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేయగలిగే ఓటు బ్యాంకుపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రధానంగా ఏపీలో బీసీలు అధికం. ఆ తర్వాత కాపులు, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాల వారు ఉన్నారు. అందుకు కులాల ఎజెండాగా ఇప్పటి నుంచే పావులు కదుతున్నాయి పార్టీలు. ప్రతి ఎన్నికల్లో బీసీల ఓట్లు అత్యంత ప్రభావం చూపిస్తున్నాయి. అంతెందుకు బీసీలు ఎక్కువగా మొగ్గు చూపిన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కూడా గత ఎన్నికల్లో స్పష్టం అయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రధాన పార్టీలన్నీ బలహీనవర్గాల ఓట్లపై ఫోకస్ పెట్టాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా ఓట్లు చీలిపోవడం అనేది చాలాస్పష్టంగా కనిపిస్తుందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్. అందుకే సీట్ల కేటాయింపులో కూడా స్థానికంగా బలంగా ఉండే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులకు అన్ని పార్టీలు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి సీట్లతో అధికారం చేజిక్కించుకుంది. ఇందుకోసం బలమైన కారణం పెద్ద ఎత్తున బీసీ ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా పోల్ అవడమేనని తెలిసింది. అందుకే ఈసారి కూడా బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రంలో మొత్తం 139 బీసీ కులాలున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు వేస్తోంది. ఆయా కులాలకు ఎవరి హయాంలో ఏం జరిగిందనేది చెప్పుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు పార్టీలు. బస్సు యాత్ర, కులగణనతో వైసీపీ.. కుల సంఘాలతో టీడీపీ సమావేశాలు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. స్వయంగా సీఎం వైఎస్ జగన్ కూడా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ తన స్పీచ్‌లను కొనసాగిస్తున్నారు. నగదు బదిలీ పథకం ద్వారా భారీగా బలహీన వర్గాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లక్షల కోట్ల నిధులు సాయం అందించినట్లు చెబుతున్నారు వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 139 బీసీ కులాలున్నట్లు ప్రభుత్వం లెక్క వేసింది. బీసీలోని కులాలతో పాటు వాటి ఉప కులాలను కలిపి ఈ లెక్కగా చెబుతోంది. అయితే ఆయా కులాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. మొత్తం 56 కార్పొరేషన్ల ద్వారా బీసీలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెబుతోంది. మరోవైపు సమగ్ర కులగణన ద్వారా బీసీలకు మేలు జరుగుతుందని కూడా చెబుతోంది వైసీపీ సర్కార్. ఇదిలావుంటే బీసీ జనాభా ఎంత శాతం ఉన్నదనేది నోటి మాటగానే తప్ప సరైన లెక్క లేదు…దీంతో సమగ్ర కులగణన ద్వారా బీసీ కులాలు, ఉపకులాల లెక్క తేలితే దాని ద్వారా మరింత సంక్షేమం అందించి బీసీలను ఆర్ధికంగా అభివృద్ది చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీని కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ను ముందు పెట్టి కులగణన ప్రక్రియను కొనసాగిస్తోంది. బీసీలకు నామినేటెడ్ పదవులు, ఇతర పదవుల్లో కూడా బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొస్తుంది. బీసీలను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక సామాజిక సాధికార బస్సు యాత్రల్లో సైతం బీసీ మంత్రులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బీసీలకు వైసీపీ హయాంలో ఎలాంటి మేలు జరిగిందనేది చెప్పుకొస్తున్నారు. వైసీపీ వాదన ఇలా ఉంటే, తెలుగు దేశం పార్టీ కూడా బీసీ మంత్రం మొదలుపెట్టింది. అసలు టీడీపీ వచ్చిన తర్వాతే బీసీలకు గుర్తింపు వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..మొదటి నుంచీ బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. వైసీపీ బస్సు యాత్రలు, కులగణన కు పోటీగా బీసీ అఖిలపక్ష నేతలతో తెలుగుదేశం పార్టీ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. బీసీ కులసంఘాల నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని, బీసీ కార్పొరేషన్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామనే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు బీసీలపై ఫోకస్ పెట్టడంతో ఈసారి ఎవరివైపు బీసీలు మొగ్గు చూపుతారనే చర్చ జరుగుతుంది.
Admin