జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసేందుకు నారా లోకేష్ విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు నారా భువనేశ్వరి. ‘నిజం గెలవాలి’ అంటూ యాత్ర చేపట్టబోతున్నారు నారా భువనేశ్వరి. ఇక యువగళం యాత్రను పక్కనబెట్టిన లోకేష్.. భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రను కొనసాగించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత.. ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ పార్టీని నడిపించిన చంద్రబాబు లేని లోటు క్షేత్రస్ధాయిలో క్యాడర్‌పై పడుతోంది. దీన్ని అధిగమించేందుకు నారా లోకేష్, నారా భువనేశ్వరి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే వారం నుంచి అమల్లో పెట్టేందుకు కూడా సిద్దమయ్యారు. చంద్రబాబు అరెస్టు తర్వాత.. పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలను పరామర్శించాలని ఆయన నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. ప్రతీ వారం రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. “నిజం గెలవాలి” పేరుతో ఈ యాత్రను చేపడుతున్నారు భువనేశ్వరి. ఈ యాత్ర షెడ్యూల్, ఏర్పాట్లపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో ఆయన అప్పటి వరకూ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రతో పాటు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కూడా నిలిచిపోయింది. దీంతో యువగళాన్ని కొన్ని రోజులు పక్కనబెట్టి.. భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రను కొనసాగించాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చాక తిరిగి యువగళం పాదయాత్ర పునఃప్రారంభించాలని నిర్ణయించారు. అప్పటివరకూ జిల్లాల్లో పర్యటిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రలతో టీడీపీ క్యాడర్‌ను ఉత్సాహపరచాలని భావిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా నాలుగైదు రోజుల్లో టీడీపీ విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించబోతున్నారు లోకేష్. శుక్రవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు వస్తే చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 40రోజులకు పైగా జైలులో ఉన్న చంద్రబాబు.. బయటకొచ్చినా ఇప్పుడప్పుడే మునుపటి ఉత్సాహంతో ప్రజల్లోకి వస్తారని అనుకోలేం. పైగా ఆయనకు చర్మ సంబంధిత సమస్యలున్నాయని అంటున్నారు. మానసికంగా, శారీరకంగా ఆయన పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుంది. అసలు జైలునుంచి విడుదలే కాకపోతే బాబు ప్రస్తావనే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా లోకేష్, భువనేశ్వరి జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు భువనేశ్వరి.
Admin