జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మెజార్టీ మార్క్ ను సాధించుకుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈక్రమంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఆదివారం రాత్రి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వనించాలని కోరారు. దీనిపై స్పందించిన తమిళసై సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఉదయం సీఎల్పీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ తెలిపింది. రేవంత్ రెడ్డిని సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఢిల్లీ పెద్దలుగా వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్లు దీపాదాస్‌మున్షీ, బోసురాజు, అజయ్‌కుమార్, ఇన్‌ఛార్జి ఠాక్రేతో పాటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొంటారు. వీరందరి సమక్షంలో ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలిలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత డిశంబర్ 6వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలోనే సోమవారం ఎన్నికల సంఘం అధికారి తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తారు. ఆ తరువాత ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అప్పుడు కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు తొలి అడుగు సీఎల్పీ అధ్యక్షుడి నియామకంతో ముడి పడి ఉంటుంది కనుక నేడు రేవంత్ రెడ్డిని శాశన సభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు సిద్దమవుతున్నారు కాంగ్రెస్ నాయకులు.
Admin