జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రీ క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అద్భుతమైన విద్యుత్ కాంతులతో, రంగురంగుల తోరణాలతో ఎల్బీ స్టేడియంను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏసుప్రభువుకు సంబంధించిన భక్తి కీర్తనలను పాడి వినిపించారు కళాకారులు. లైవ్ మ్యూజిక్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకకు క్రైస్తవ మత పెద్దలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి వేదిక పైకి చేరుకున్న వెంటనే ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి హాజరయ్యారు. కేక్ కటింగ్ కార్యక్రమం అయిన తరువాత రేవంత్ రెడ్డి ప్రసంగించారు. క్రిస్మస్ ప్రత్యేకత, క్రీస్తు గొప్పతనాన్ని గురించి వివరించారు. ఈ దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ముందుకు సాగాలంటే లోక్ సభ ఎన్నికల్లో మువ్వన్నెల జెండాను ఢిల్లీ కోట మీద ఎగురవేయాలన్నారు. దేశంలో రక్షణ వ్యవస్థపై అనేక అనుమానాలున్నాయని దీనికి ఉదాహరణ మణిపుర్ లో జరిగిన ఘటనలే నిదర్శనమన్నారు. దేశంలో శాంతి భద్రతల దిశగా ప్రతి ఒక్క పౌరుడు అడుగులు వేయాలని అందుకు బిషబ్లు ఆశీర్వదించాలని కోరారు. తమ ప్రభుత్వంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు
Admin