జై భీమ్ టీవీ - తెలంగాణ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లి కూతురు రవళి ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. పెళ్లి కొడుకు వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు రవళి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న రవళి పెళ్లికి కొన్ని గంటల ముందు ఆత్మహత్యకు పాల్పడడం అందరిని కలిచివేసింది. పెళ్లి వేడుకల్లో డాన్స్ సైతం చేసిన రవళి రాత్రి సంతోష్‌తో ఫోన్లో మాట్లాడిన తరువాత ఆమె డల్‌గా మారిపోయిందని అంటున్నారు. ఆస్తి కోసం, జాబ్ చేయాలని సంతోష్ ఒత్తిడి చేయడంతో రవళి సూసైడ్ చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన నిజామాబాద్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి కూతురు ఆత్మహత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు తాజాగా.. వరుడు సంతోష్‌పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రవళి, సంతోష్ కాల్‌డేటాను సేకరిస్తున్నారు.సంతోష్ ఒత్తిడితోనే రవళి ఆత్మహత్య చేసుకుందంటున్నారు అమ్మాయి కుటుంబసభ్యులు. ఖచ్చితంగా జాబ్ చేయాలని పట్టుబట్టాడని.. అలాగే ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే అవన్నీ అవాస్తవాలంటున్నాడు సంతోష్. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నాడు.అప్పటివరకు కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా ఉన్న రవళి..అంతలోనే ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటన్న అంశంపై నిజానిజాలేంటన్నది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
Admin