జై భీమ్ టీవీ - జాతియం / న్యూ ఢిల్లీ : న్యూఢిల్లీ: ఇండియా (INDIA) కూటమి మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో సాయంత్రం 3 గంటలకు సమావేశమవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి కూటమి భేటీ అవుతుంది. అంతకంటే ముందు మూడు సార్లు (పాట్నా, బెంగళూరు, ముంబై) విపక్ష కూటమి సమావేశమైంది. ఈరోజు సమావేశం అజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారణ ప్రణాళిక ప్రధానాంశాలు.. అలాగే పార్లమెంట్ ఉభయ సభల నుంచి 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు కూటమి ముందున్న సవాళ్లలో ప్రధానమైనవి. ప్రధాని మోదీకి కౌంటర్‌గా ‘నేను కాదు.. మేము’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మధ్యభారతంలోని మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తాజా ఓటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురుకానుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌తో ఉన్న విభేదాలను కాంగ్రెస్ పరిష్కరించుకుందని ఆ పార్టీవర్గాలు తెలిపాయి. దీంతో కూటమి సమావేశంలో అఖిలేశ్ పాల్గొనే అవకాశం ఉంది. టీఎంసీ అధినేత్రి మమత ఈనెల 17-19మధ్యలో ఢిల్లీలో ఉంటారు. ఆమె కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Admin