జై భీమ్ టీవీ - జాతియం / : ఢిల్లీ అంటే ఒకప్పుడు దేశ రాజధానిగా గొప్పగా చెప్పుకునే వారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు అక్కడి స్థానికులు. ప్రస్తుతం పర్యాటకులు సంఖ్య భారీగా తగ్గింది. పిల్లల స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. పొగ వెలువడే వాహనాలకు అనుమతులు రద్దు చేశారు. వీటన్నింటికీ కారణం విపరీతంగా పెరిగిపోయిన వాయుకాలుష్యం. గతంలో వాయు నాణ్యత సూచి 600కు పైగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ నగరంలో కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో గతంలో విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో గాలిలో వేగం పెరిగింది. దీంతో పాటూ పవనదిశను మార్చుకుంది. దీని కారణంగా కాలుష్య తీవ్రత తగ్గినట్లు వివరించారు కాలుష్య కంట్రోల్ ప్లాన్ అధికారులు. ఢిల్లీలో వాయు నాణ్యత గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత మేర మెరుగవడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులకు తావిచ్చింది. సెప్టెంబరు చివరి వారం నుంచి నవంబర్ రెండవ వారం వరకూ క్లిష్టమైన పరిస్థితులు కొనసాగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి సివియర్ నుంచి వెరీ పూర్ కు చేరుకుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఢిల్లీ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను సడలించారు. స్కూళ్లకు దాదాపు వారం సెలవులు ప్రకటించిన ప్రభుత్వం సోమవారం నుంచి పాఠశాలలకు వెళ్లవచ్చని తెలిపారు. గతంలో నిర్మాణ రంగం నుంచి దుమ్ము, పొగ వెలువడటంతో నిర్మాణ పనులు రద్దు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వీటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. యదావిధిగా నిర్మాణ పనులు చేసుకోవచ్చని తెలిపింది. అలాగా కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కులకు అనుమతులు నిరాకరించిన ప్రభుత్వం.. ప్రస్తుతం వాటికి అనుమతి ఇస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. శుక్రవారం ఏక్యూఐ సూచి 405 కాగా శనివారం 319కి తగ్గినట్లు వెల్లడించారు. 24గంటల వ్యవధిలో భారీగా తగ్గినట్లు చెబుతున్నారు జీఆర్‌ఏపీ అధికారులు.
Admin