జై భీమ్ టీవీ - జాతియం / : ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీలకు పెద్ద తలనొప్పి వ్యవహారం. టికెట్ ఆశించే నేతలు ఎక్కువగా ఉండడం, సమర్థత, ఆర్థిక, సామాజిక బలాబలాల ప్రకారం ఆశావహులను వడపోసినా సరే.. చివరకు ఒక్కో సీటు కోసం ఇద్దరు ముగ్గురు నేతలు గట్టిగా పోటీపడుతున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబావుటా ఎగరేయడం కూడా రాజకీయాల్లో మనం చూస్తుంటాం. అలాంటి నేతలను తన్నుకుపోయి టికెట్ ఇచ్చేందుకు ఎదురుచూసే పార్టీలు కూడా మనకు తారసపడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి చిత్రాలెన్నో కనిపిస్తున్నాయి. ఈ పార్టీలో టికెట్ రాకపోతే.. ఆ పార్టీలో రెడీ అన్న చందంగా పరిస్థితి తయారైంది. షెడ్యూల్ కంటే ముందే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా వాతావరణం నెలకొంది. అందులో భారతీయ జనతా పార్టీ రెండు విధాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఓవైపు రెబెల్స్ బెడద.. మరోవైపు సుదీర్ఘకాలంగా సీఎం పీఠంపై ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఎదుర్కొంటున్న సహజ వ్యతిరేకత.. ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. రెబెల్సే కదా అని తేలిగ్గా తీసుకుంటే… టికెట్ దొరకనివారిలో అసంతృప్తి సహజమే. ఆశించి భంగపడ్డవాళ్లు తిరుగుబాటు చేయడం కూడా సహజమే అని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఆ తిరుగుబాటు ఖరీదు పార్టీ ఓటమి కూడా కావొచ్చు. అందుకే ప్రత్యర్థి పార్టీలో రెబెల్స్‌ను తమ పార్టీ అభ్యర్థులుగా నిలిపేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. 144 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న శివరాజ్ చౌహాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుండగా, రాష్ట్రంలో మరోసారి గెలుపొంది ప్రభుత్వాన్ని కొనసాగించాలని చూస్తున్న బీజేపీ ఇప్పటివరకు 136 పేర్లను ప్రకటించింది. నవంబర్ 17న ఈ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఇంతలో, చాలా మంది ఆశావహులకు టిక్కెట్లు లభించకపోవడంతో తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. బీజేపీ రెబల్స్ కొందరు కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు పొందగలిగారు. మరికొందరు ఇంకెవరైనా పిలిచి టికెట్ ఇవ్వకపోతారా అని వేచి చూస్తున్నారు. రెబెల్స్ బెడద కేవలం బీజేపీకి మాత్రమే లేదు. కాంగ్రెస్ సైతం ఇదే పరిస్థితి ఎదుర్కుంటోంది. రెండు పిల్లుల తగవులాటలో కోతి లాభపడ్డట్టు.. ఈ రెండు పార్టీల రెబెల్స్ మీద మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్నేశాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పార్టీల నుంచి 30 మంది వరకు రెబల్స్ స్వతంత్రులుగా బరిలోకి దిగారు. వారిలో నలుగురు గెలుపొందారు కూడా. మిగతావారిలో చాలా మంది గెలవకపోయినా.. అప్పటి వరుకు బీజేపీ – కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఉన్న పోటీని ముక్కోణపు పోటీగా మార్చి తమ పార్టీకి చెందిన అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు. అందుకే ఈ సారి రెండు పార్టీలూ రెబెల్స్ అంశాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎంత జాగ్రత్తగా కసరత్తు చేసినా సరే.. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలోనే బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి 21 మంది తిరుగుబాటు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో 15 మంది బీజేపీ రెబల్స్ కాగా.. అందులో 5 మందికి కాంగ్రెస్ టిక్కెట్లు దక్కాయి. మిగతావారిలో కొందరు నేతలు స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ బీజేపీ తిరుగుబాటు నేతల్లో దతియా నుండి అవధేష్ నాయక్, ముంగవాలి నుండి రావ్ యద్వేంద్ర సింగ్ ఉన్నారు. బీఎస్పీకి లాభమా.? టికెట్ దక్కలేదన్న కారణంతో నేతలు అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ పార్టీని వీడి బయటికొచ్చేందుకు సిద్ధపడుతుండడంతో వారిని బహుజన్ సమాజ్ పార్టీ ఎర్రతివాచీ పరిచి స్వాగతిస్తోంది. తిరుగుబాటు నేతల సొంత ఓటుబ్యాంకుకు బీఎస్పీ ఓటుబ్యాంకు తోడైతే ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రాష్ట్రమంతటా బీఎస్పీకి గెలిచేంత ఓటుబ్యాంకు లేకపోయినా… గణనీయమైన ఓట్ల శాతాన్ని ఆ పార్టీ పొందగల్గుతోంది. ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా సగటున 5-6 శాతం ఓటుబ్యాంకు ఉండగా.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అది గరిష్టంగా 20 శాతం వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తిరుగుబాటు నేతలు బీఎస్పీకి అస్త్రాలుగా మారతారని ఆ పార్టీ భావిస్తోంది. ఇన్నేళ్లుగా బీజేపీ-కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరులా కనిపిస్తున్న ఎన్నికలను తిరుగుబాటు నేతలకు బీఎస్పీ టికెట్లు ఇవ్వడం ద్వారా ముక్కోణపు పోటీగా మార్చేలా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో బీఎస్పీ లాభపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సింధియా వ్యూహం ఏంటి.? కాంగ్రెస్‌లో ఆశించిన ప్రాధాన్యత దక్కడం లేదన్న ఉద్దేశంతో ఆ పార్టీని వీడి, తనతో పాటు మరికొందరిని తీసుకుని 2020లో బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాపై అందరి దృష్టి ఉంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కమలదళం తరఫున రంగంలోకి దిగనున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాల్లో 2వ జాబితాలో బీజేపీ ఏకంగా ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపినప్పటికీ.. సింధియా పేరు మాత్రం లేదు. కైలాష్ విజయవర్ఘీయ అసెంబ్లీ ఎన్నికల్లోకి ప్రవేశించడంతో సింధియా రాష్ట్ర రాజకీయాల్లో ఉండకపోవచ్చన్న కథనాలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. తనకు విధేయుడిగా ఉంటూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వాలని సింధియా బీజేపీ అధినేతలను కోరుతున్నారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారును కూల్చి బీజేపీ సర్కారు ఏర్పర్చడానికి సహకరించిన సింధియాను సంతృప్తి పరిచేందుకు బీజేపీ తన అభ్యర్థుల్లో కొంతమందిని త్యాగం చేయక తప్పడం లేదు. తొందరపడి కోయిల.. ముందే కూసింది ఎన్నికల ప్రచారపర్వంతో మిగతా పార్టీల కంటే ముందుండాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ముందుగానే ప్రకటించి తప్పుచేసిందా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. తొలి జాబితాలో అనేక స్థానాల్లో ప్రస్తుతం ఆ పార్టీ తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తోంది. తొలి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయినా నేతలు తమ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోడానికి కావాల్సినంత సమయం దొరికింది. తిరుగుబావుటా ఎగరేయడం కారణంగా కొందరికి కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్లు ఇచ్చింది. మరికొందరు బీఎస్పీలో చేరిపోయారు. మొత్తంగా తిరుగుబాటుదారులు గెలిచినా.. గెలవకున్నా.. బీజేపీ గెలుపు అవకాశాలను మాత్రం దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉంది. అదే కమలనాథుల్లో ఆందోళన కల్గిస్తోంది. ఏకమైన కాంగ్రెస్ వర్గాలు.. సుదీర్ఘకాలం పాటు ఒకే వ్యక్తి పాలనలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా రూపంలో ఎదురైన తిరుగుబాటు ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చిసినందున.. ప్రస్తుత పార్టీలో కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వర్గాలు రెండూ కలిసి పనిచేస్తున్నాయి. పొరుగునే ఉన్న రాజస్థాన్‌లోనూ అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ మాదిరిగా కీచులాటలు, తగవులు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ఇరువర్గాల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తమ తమ నాయకులతో కలిసి ఐక్యంగా పనిచేస్తున్నారని, ఈ ఐక్యత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ విజయాన్ని అందిస్తుందని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. ఈసారి మాత్రం 2020 నాటి తిరుగుబాటు తరహా పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి.
Admin