జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న కండక్టర్ నియామకాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ఆర్టీసీలో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 813 మందిని కండక్టర్లుగా నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. కండక్టర్లుగా విధులు నిర్వహిస్తూ.. మరణించిన సిబ్బంది వారసులతో ఆ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ స్కీమ్ కింద.. అభ్యర్థుల విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ నిర్ణయంతో విధి నిర్వహణలో ఉండగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, నల్గొండ 56, మహబూబ్‌నగర్ 83, మెదక్ 93, వరంగల్ 99, ఖమ్మం 53, అదిలాబాద్ 71, నిజామాబాద్ 69, కరీంనగర్ రీజియన్‌లో 45.. మొత్తం 813 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Admin