జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. హైదరాబాద్ HMDA లో ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూజకు ఐటీ సెల్ లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో HMDA పేర్కొంది. మెడికో ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రీతి మరణించిన తర్వాత ఆమె కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందచేసింది. అదే సమయంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి కేటీఆర్ తన శాఖ పరిధిలోని HMDA లో ప్రీతి చెల్లి పూజకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు మే 20వ తేదీ శనివారం పూజను HMDA ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను ప్రీతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెడికో ప్రీతి..2023 ఫిబ్రవరి 22న పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కోమాలోకి వెళ్లిన ప్రీతిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ప్రీతిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిమ్స్‌లో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి కన్నుమూసింది
Admin