జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కేజీబీవీ పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పలు హామీలిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రూ.3 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మించిన KGBVని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. kgbvకి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని, పాత జూనియర్ కళాశాల భవనం స్థానంలో కొత్త జూనియర్ కళాశాల భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. రూ.2 కోట్లతో రుద్రంగిలో రోడ్లు అభివృద్ధి చేసి లైటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. రుద్రంగిలో ఫిబ్రవరిలో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తామన్నారు. సీఎం కేసిఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు నాయకత్వంలో అద్భుత ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ టెంపుల్, పట్టణం అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లలో విద్యారంగ వికాసానికి రూ. 123 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రకు చెందిన 14 గ్రామాల సర్పంచ్ లు, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో విలీనం చేసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ‘2014కు ముందు 29 లక్షల మందికి పెన్షన్ లు వచ్చేవి. ఇప్పుడు పెన్షన్ మొత్తాన్ని పది రెట్లు పెంచి 46 లక్షల మందికి అందిస్తున్నాం. 2014 కు ముందు మనిషి సచ్చిపోతే కరెంట్ కోసం అధికారులను ప్రాధేయ పడాల్సి వచ్చేది. దేశంలో 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. తెలంగాణలో 64 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 9 విడతలకు జమ చేశాం. త్వరలోనే రైతు బంధు రూపంలో 7600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఎవ్వరేమన్న .. ప్రజల ఆశీస్సులు తమపై ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తాం. మాకంటే రెండు పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకొండ్రి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ అరుణ రాఘవ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Admin