జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి మావోయిస్టు పార్టీలు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా టేకమెట్ట అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ కు నిరసనగా బంద్ పిలుపునిచ్చారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ప్రజలంతా బంద్ లో భాగస్వామ్యం కావాలన్నారు. మావోయిస్ట్‌ల బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు, భూపాలపల్లి ఏజెన్సీల్లో భారీగా మోహరించారు. చత్తీస్‌గడ్- తెలంగాణ , మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పోలీసులు నిఘా పెట్టారు. రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్‌ల హిట్ లిస్ట్‌లో ఉన్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే.. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కంతి లింగవ్వ అలియాస్ అనిత మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీ ఇక్కడి మారుమూల పల్లెలో సమాంతర వ్యవస్థ నడిపించిన సమయంలో దళంలో సభ్యుడుగా కొనసాగుతున్న మైలారం అడెల్లు అలియాస్ భాస్కర్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మెంబర్ గా, ఏరియా కమిటీ మెంబర్‌గా ఉన్న ఆమెపై చత్తీస్ గఢ్ప్రభుత్వం రూ. 16 లక్షల రివార్డు ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. అయితే లింగవ్వ పార్టీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా రిక్రూట్మెంట్ లపై ఎక్కువ దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్సరిహద్దు ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం సమావేశమయ్యారు. అదే సమయంలో పోలీసులు వీరిని చుట్టుముట్టి ఎదురుకాల్పులు జరపడంతో కంతి లింగవ్వ తోపాటు మరో వ్యక్తి మరణించారు.
Admin