జై భీమ్ టీవీ - తెలంగాణ / : సముద్రంలాంటి కాంగ్రెస్. ఎవరి గోలవారిదే. కానీ ఆయన గోలమాత్రం పార్టీది. ఎందుకంటే ఆయన పంతం పార్టీ కోసం. ఆయన సవాల్ తనని రాజకీయంగా నిలబెట్టిన కాంగ్రెస్ కోసం. అధికారంలోకొచ్చాకే గడ్డం తీస్తానన్న కాంగ్రెస్ సీనియర్ అదే మాటమీదున్నారు. ఇప్పుడు పదేపదే ఆయన ఇంకో సవాల్ కూడా చేస్తున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటున్నారు ఉత్తమ్. 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఇది మొదటిసారి కాదు. ఎన్నికల్లోపు ఇంకొన్నిసార్లు కూడా వినాల్సి వచ్చేలా ఉంది. పోయినచోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో ఉన్నారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో గెలిచిన ఉత్తమ్ తర్వాత ఎంపీగా కూడా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఆయన హర్ట్ అయ్యారు. ఈసారి హుజూర్‌నగర్‌లో తిరుగులేని మెజారిటీతో గెలవాలన్నదే ఆయన టార్గెట్. గెలుపు గ్యారంటీ అన్న ధీమా దగ్గరే ఆగలేదాయన. 50వేలపైనేనంటున్నారు. అంతకంటే తగ్గితే రాజకీయాలు వదిలేస్తానంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చేదాకా గడ్డం తీసేది లేదని గతంలో పంతంపట్టారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఇప్పుడు మెజారిటీపై సవాల్ చేస్తున్నారు. ఉత్తమ్ గెడ్డంపై బీఆర్‌ఎస్ అగ్రనేతలనుంచి తరచూ సెటైర్లు పడుతున్నాయ్. నాలుగేళ్ల క్రితమే నువ్వు గెడ్డం గీస్తే ఏందీ గీయకపోతే ఏందీ అంటూ కేసీఆర్ బహిరంగసభలోనే పంచ్ వేశారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉత్తమ్ సవాళ్లపై గురిపెట్టారు. ఈసారి కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గెడ్డం తీసే ఛాన్స్ రాదంటున్నారు కేటీఆర్. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు వరస పరాజయాలు ఎదురవ్వడంతో టీపీసీసీ అధ్యక్ష పదవిని వదులుకున్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అప్పట్నించీ హుజూర్‌నగర్‌లో తిరుగులేని మెజారిటీతో గెలిచి ఆ ఓటమికి సమాధానం చెప్పాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా విధులు నిర్వర్తించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. 1994లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. 1994లో కోదాడలో తొలిసారి పోటీచేసి ఓడిపోయారు. 1999లో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచీ వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో హుజూర్‌నగర్‌నుంచి ఉత్తమ్, కోదాడలో ఆయన భార్య గెలిచారు. కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర మంచి గుర్తింపు ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సవాళ్లతో అందరి నోళ్లలో నానుతున్నారు. మరి ఆయన గెడ్డం తీసే రోజు దగ్గర్లోనే ఉందో, రాజకీయాల్లో కొనసాగుతారో, సన్యాసం తీసుకోవాల్సి వస్తుందో కాలమే నిర్ణయించబోతోంది.
Admin