జై భీమ్ టీవీ - తెలంగాణ / : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా ఫోకస్ చేసింది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కమలనాథులు కదం తొక్కుతున్నారు. తెలంగాణలో మంగళవారం నిర్మలాసీతారామన్, ఫడ్నవీస్, పీయుష్ గోయల్ ప్రచారం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లో నిర్మలా సీతారామన్, ముషీరాబాద్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేస్తారు. 24, 25, 26 తేదీల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించనున్నారు. ఈ నెల 25, 26న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటిస్తారు. హుజూరాబాద్, మహేశ్వరం సభలకు ఆమె హాజరవుతారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 22న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 26న అమిత్‌షాతో కలిసి పవన్ హైదరాబాద్‌లో ప్రచారం చేస్తారు. పొత్తులో భాగంగా ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్.. ప్రచారం పార్టీకి కలిసివస్తుందని కాషాయపార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ప్రచారంలో భాగంగా.. పవన్ కల్యాణ్ వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో రోడ్ షో చేయనున్నారు. నెలాఖరులో తెలంగాణలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు వరకూ తెలంగాణలోనే మకాం వేయడం ద్వారా బీజేపీ కేడర్‌లో జోష్ నింపనున్నారు మోదీ.. ఇప్పటికే పలు సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. తెలంగాణలో బీజేపీని గెలిపించాలంటూ కోరారు. అగ్రనేతల షెడ్యూల్ ఇలా.. 24, 25, 26 తేదీల్లో యూపీ సీఎం యోగి పర్యటన ఈ నెల 25, 26న స్మృతి ఇరానీ పర్యటన ఈ నెల 22న వరంగల్ బహిరంగ సభకు పవన్ ఈ నెల 26న అమిత్‌షాతో కలిసి పవన్ ప్రచారం ఈనెల 25, 26, 27 తేదీల్లో మోదీ ప్రచారం
Admin