జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇప్పుడు వాహనదారులను వణికిస్తోంది. సిగ్నల్స్ బెడద లేకుండా నేరుగా వెళ్ళేందుకు ఆ ఫ్లైఓవర్‌ను వాహనదారులు ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు అదే ఫ్లైఓవర్ ప్రాణాలు తీస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి ఈ ఫ్లైఓవర్ పై.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరి యువకుల ప్రాణాలు బలిగొంటే.. మరో యువకుడిని ఆసుపత్రి పాలు చేసింది. 2019 నుంచి డేటా తీసుకుంటే.. ఈ నాలుగేళ్ల కాలంలోనే.. వేర్వేరు ప్రమాదాల్లో 13 మందిని ఈ ఫ్లైఓవర్ బలి తీసుకుంది. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లైఓవర్ మీద ఉన్న మృత్యు మలుపే ఈ యాక్సిడెంట్లకు ప్రధాన కారణమంటున్నారు. వెహికల్స్ హై స్పీడ్‌తో వెళ్లడంతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు… ప్రమాదాలకు కారణామవుతున్నాయంటున్నారు పోలీసులు. ఈ విషయంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవీఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు ట్రాఫిక్ పోలీసులు లేఖ కూడా రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన సీపీ రవిశంకర్ అయ్యన్నార్….ఈ సమస్యను మరోసారి జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్లాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటున్నారు స్థానికులు. ఫ్లైఓవర్ ఎత్తు పల్లాలుగా ఉండడంతో పాటు రైల్వే స్టేషన్ వైపు వెళ్లేటప్పుడు చిన్నపాటి మలుపు, ఆపై డౌన్ కూడా ఉంది. ఈ క్రమంలో హై స్పీడ్ గా వస్తున్న వాహనాలు ఆ మలుపు వద్ద అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇదే మృత్యు మలుపుగా మారింది. దీనికి తోడు మలుపు తిరుగుతున్న సమయంలో.. రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పల్లం ఉండాల్సింది పోయి.. రైట్ సైడ్ టిల్ట్ ఉండడం… ఈ ప్రమాదాలకు ఒక కారణమని ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు చెబుతున్నారు. జీవీఎంసీ అధికారులు ఇన్‌స్పెక్షన్ చేసినా…శాశ్వత నివారణ చర్యలు చేపట్టలేదు. వాహనదారుల స్పీడుకు పోలీసులు కళ్లెం వేయగలరు కానీ…ఇంజినీరింగ్ లోపాలను వాళ్లు సరిచేయలేరు. జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం శాశ్వత చర్యలు తీసుకుంటేనే ఈ ఫ్లైఓవర్‌పై మరణ మృదంగానికి అడ్డుకట్ట పడుతుందంటున్నారు స్థానికులు
Admin