జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగుదేశం-జనసేన పార్టీలు ఎట్టకేలకు ఉమ్మడి ఆందోళనలకు సిద్ధమయ్యాయి. పొత్తు ప్రకటన చేసిన సుమారు రెండు నెలల తర్వాత ఉమ్మడి కార్యాచరణ ద్వారా ముందుకెళ్తున్నాయి. ఇవాల్టి నుంచి ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయి పోరాటాలు చేసేందుకు సిద్దమయ్యాయి. రెండు పార్టీల కేడర్ కలిసికట్టుగా ముందుకెళ్లేలా ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు పూర్తి చేశారు నాయకులు. మినిమేనిఫెస్టో కూడా సిద్దం కావడంతో ఇకపై నిత్యం ఏదొక ప్రజాసమస్యపై ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి ఇరు పార్టీలు. పొత్తుల ప్రకటన తర్వాత రెండు పార్టీల నేతలు చాలా వేదికలపై కలుసుకున్నారు. అయితే ప్రభుత్వంపై ఎలాంటి ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జేఏసీ ఏర్పాటు, జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాలతో రెండు పార్టీల నాయకులను ఒకేతాటిపైకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ సమన్వయ సమావేశాల్లో అక్కడక్కడా గొడవలు జరిగినప్పటికీ వాటిని సరిదిద్దుకుంటామంటున్నారు పార్టీ నేతలు. ఇప్పటికే మిని మేనిఫెస్టో కూడా సిద్దం కావడంతో ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి సమస్యలను బయటపెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మరో వైపు ప్రతి 15 రోజులకు ఒక సమస్యపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని ఇప్పటికే రాష్ట్రస్థాయి జేఏసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు, రేపు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు నాయకులు. జేఏసీ పిలుపుతో శనివారం, ఆదివారం ఇరుపార్టీల నాయకులు కలిసి ఉమ్మడిగా పోరాటాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు దారేది పేరుతో ఉమ్మడి ఆందోళనల ద్వారా డిజిటల్ క్యాంపెయిన్ చేయనున్నారు. మరిన్ని సమస్యలపై వరుస ఆందోళనలు విజయవాడలో ఈ నెల 9 వ తేదీన జరిగిన ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో ఉమ్మడి ఆందోళనలపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జేఏసీ సమావేశంతో పాటు ఒక్కో సమస్యపై ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒక జాబితాను సిద్దం చేసారు. రోడ్ల సమస్యలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతుల ఇబ్బందులు, కరెంట్ చార్జీల పెంపు, నిత్యావసర ధరల పెంపు, ఇసుక సరఫరా, మద్యం అమ్మకాల్లో అక్రమాలు, యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం వంటి అంశాలపై ఆందోళనలు చేయాలని టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ కమిటీ నిర్ణయించింది.
Admin