జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : Andhra Pradesh: ఒకప్పపుడు కమలం పొత్తుకోసం.. కమలం ఆశిస్సుల కోసం.. కమలం పెద్దల పిలుపు కోసం.. ఆపార్టీ గుమ్మం బయటే పడిగాపులు కాసిన పార్టీలు.. ఇప్పుడెందుకు అటువైపు చూడడం లేదు. కమలం పెద్దల ఆపాయింట్‌మెంట్‌కోసం ఆరాటపడిన అధినేతలు.. ఇప్పుడెందుకు ఆ ఊసు ఎత్తడం లేదు. మీకు మీరే మాకు మేమే అన్న తరహాలో.. ఎవరి రాజకీయం వారు నడుపుతున్నారా? ఎవరి పొత్తు ధర్మం వారు పాటిస్తున్నారా? Andhra Pradesh BJP: చిత్రవిచిత్రంగా ఏపీ బీజేపీ పరిస్థితి.. స్వయంకృతాపరాధమే ఇలా చేసిందా? Andhra Pradesh: ఒకప్పపుడు కమలం పొత్తుకోసం.. కమలం ఆశిస్సుల కోసం.. కమలం పెద్దల పిలుపు కోసం.. ఆపార్టీ గుమ్మం బయటే పడిగాపులు కాసిన పార్టీలు.. ఇప్పుడెందుకు అటువైపు చూడడం లేదు. కమలం పెద్దల ఆపాయింట్‌మెంట్‌కోసం ఆరాటపడిన అధినేతలు.. ఇప్పుడెందుకు ఆ ఊసు ఎత్తడం లేదు. మీకు మీరే మాకు మేమే అన్న తరహాలో.. ఎవరి రాజకీయం వారు నడుపుతున్నారా? ఎవరి పొత్తు ధర్మం వారు పాటిస్తున్నారా? ఎందుకిలా జరుగుతోంది అంటే.. స్వయం కృతాపరాధమే అన్నది కొందరి విశ్లేషణ.. దేనికైనా టైం రావాలిగా అన్నది మరొకందరి వివరణ. ఏపీలో బీజేపీ ఒంటరిగా నడకలేనా.. 2024లో ఆపార్టీతో కలిసి నడిచే పార్టీలు లేవా అన్న డీప్ డిస్కషన్ కాస్త గట్టిగా జరుగుతోంది. కర్నాటక ఎన్నికలకు ముందు బీజేపీ ఒకేమాట.. ఒకే పొత్తు అన్న తరహాలో ఏపీలో రాజకీయం నడిపించింది. జనసేనతో తప్ప టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఆపార్టీ రాష్ట్ర నేతలు పదే పదే బల్లగుద్ది మరీ చెప్పారు. మరోవైపు టీడీపీ బీజేపీకి దగ్గరకు కావాలని తనవంతు ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చింది. కానీ టీడీపీ స్నేహహస్తాన్ని కమలం తిరస్కరించింది. కారణం 2014 ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన టీడీపీ.. 2019 ఎన్నికలకు ముందు ఫ్లేటు ఫిరాయించడం. బీజేపీ విధానాలపై జాతీయ స్థాయిలో విరుచుకపడ్డారు చంద్రబాబు. మోడీ ఖబడ్దార్ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించడం కూడా బీజేపీకి కోపం తెప్పించింది. ఆనాటి చంద్రబాబు మాటలను కమలం గుర్తు చేసుకుని మరీ అలాంటి అవకాశవాద రాజకీయాలకు తాము దూరం అంటూ చెప్పుకొచ్చింది. అయితే బీజేపీతో నేరుగా బంధం బలపడకపోవడంతో.. జనసేనకు టీడీపీ దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. విశాఖ ఘటనకు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నేరుగా పరామిర్శించడం.. తర్వాత చంద్రబాబుకు పలు సందర్భాల్లో జనసేన మద్దతు తెలపడం ఇలా టీడీపీ-జనసేన మధ్య బలపడసాగింది. ఇలా టీడీపీ జనసేనతో సన్నిహితంగా మెలుగుతూ.. బీజేపీతో టైఅప్ కోసం ప్రయత్నించింది. ఇటు పవన్ కల్యాణ్ సైతం ప్రభుత్వ ఓటు చీలకూడదంటే టీడీపీని కలుపుకుని పోవడమే మంచిందన్న అభిప్రాయం ఢిల్లీ పెద్దల ముందు వ్యక్తం చేస్తూ వచ్చారు. బీజేపీ రూట్‌మ్యాప్ కోసం జనసేన నెలలు తరబడి వెయిట్ చేసింది. ఈ సందర్భంలో ఓ రకంగా జనసేన+టీడీపీలను శాసించే స్థానంలో బీజేపీ ఉండేది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవ్ కదా. సీన్ కట్ చేస్తే కర్నాటక ఫలితాలు చేదు అనుభవాన్ని మగిల్చాయి. కమలం ఊహించని విధంగా పరాజయం చెందడం.. కాంగ్రెస్ పుంజుకోవడంతో బీజేపీ స్టాండ్ మారిపోయింది. టీడీపీకి ఫోన్లో కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని బీజేపీ.. ఏకంగా ముఖాముఖీ మీటింగే పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఆపార్టీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి భేటీ అయ్యారు. వీరి భేటీలో పొత్తు అంశంపై కూడా చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఇక టీడీపీ+బీజేపీ+జనసేన పొత్తు ఖాయమేనన్న ప్రచారం జోరందుకుంది. 2024లో వైసీపీని గద్దె దించేందుకు ఈ మూడు పార్టీలు ఏకమవబోతున్నాయన్న వార్తలూ ఊపందుకున్నాయి. ఈ దశలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమించారు. పురంధేశ్వరి నియామకం కూడా టీడీపీకి దగ్గరయ్యేందుకే అన్న ప్రచారం కూడా జరిగింది. ఇలా టీడీపీ+జనసేనతో ఆల్‌మోస్ట్ బంధం కన్ఫమ్ అవుతుందనగా.. పెద్ద ట్విస్ట్.. రాజకీయంగా పెనుభూకంపం ఏపీలో చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో టోటలో ఏపీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. దగ్గరవుతారనుకున్నవారు దూరంగా దూరంగా ఇంకా ఇంకా దూరంగా జరిగిపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా.. టీడీపీతో కలిసి తాము రాజకీయ ప్రయాణం చేస్తామని పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటించడం రాజకీయంగా పెను సంచలనమే. పొత్తు ప్రకటన పవన్ కళ్యాణ్ తొందరపాటు నిర్ణయమని కొందరు విశ్లేషిస్తే.. అదను చూసి పదునైన పొత్తు బాణం వదిలారన్నది రాజకీయ అనుభవజ్ఞులు మాట. ఎన్డీఏలో భాగస్వామిని అని చెబుతూనే పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేతకు మద్దతుగా నిలవడం కమలానికి షాక్ ఇచ్చింది. అదేసమయంలో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్నిచ్చింది. అధినేత లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు పవన్ కళ్యాణ్ కొండంత అండగా నిలబడినట్లైంది. బీజేపీతో పొత్తు కంటే.. టీడీపీతో ముందుకు సాగడమే నయమని ఆ క్షణంలో జనసేన అధ్యక్షుడు భావించారా.. పొత్తుమాట ఆవేశంలో వచ్చిందా అన్నది పక్కనపెడితే.. రాజకీయంగా పవన్ కళ్యాన్ నిర్ణయం సరైన నిర్ణయమే అన్నది మెజార్టీ పొలిటికల్ ఫాలోయర్స్ అభిప్రాయం. పొత్తు నిర్ణయం అధిష్టానందేనంటూ ఆపార్టీ అధ్యక్షురాలు పదే పదే కవర్ చేస్తూ.. ఇప్పటికీ తాము జనసేనతోనే పొత్తులో ఉన్నామని చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు డెసిషన్‌పై ఏపీ బీజేపీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అన్న విషయం బీజేపీనే తేల్చుకోవాలని జనసేన పొత్తు బాల్‌ను కమలం కోర్టులో తెలివిగా వేసింది. ఇటు బీజేపీ కూడా పొత్తుల విషయం అధిష్టానమే చూసుకుంటుందని అంతే తెలివిగా పొత్తు అంశంపై ఆచితూచి స్పందిస్తూ వస్తోంది. అయితే పైకి ఇలా చెప్పుకొస్తున్నా బీజేపీలో మాత్రం అంతర్మథనం సాగుతోంది. తమతో పొత్తులో ఉన్నామని చెబుతూనే టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ఎలా ప్రకటన చేస్తారన్న అసహనం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై బీజేపీ కోర్ కమిటీలో చర్చించింది. అలాగే చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలపై కూడా కోర్ కమిటీలో డిస్కష్ చేశారట. పవన్ కల్యాణ్ చేసే ప్రతి కామెంట్‌పై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నది ఏపీ బీజేపీ మాట. అలాగే పవన్ అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని, పొత్తులతో పాటు పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామంటున్నారు కమలం నేతలు. అయితే పవన్ విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని కొర్ కమిటీలో కొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చిస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా డిస్కస్ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏలోనే ఉన్నట్లు పవన్ చెబుతున్నందున సంయమనం పాటించాలని సీనియర్ నేత అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే జనసేన కమలంతో అంత క్లోజ్‌గా ఉండి.. ఆల్‌ఆఫ్ సడెన్‌గా ఎందుకు దూరమయ్యారన్న దానిపైనా కొన్ని విశ్లేషణలు వినపడుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు శక్తివంచనలేకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకూడదని భావించిన టీడీపీ అధినేతకు.. రాజకీయంగా దొరికిన ఆయుధమే జనసేన. అందులో భాగంగానే బీజేపీ సరౌండింగ్‌లో ఉన్న జనసేనను తమవైపు తిప్పుకోవడంలో చంద్రబాబు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు వైసీపీతో బీజేపీ మరింత సఖ్యతగా ఉండటం కూడా జనసేన అధినేత మైడ్‌సెట్‌ను మార్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈమధ్య జరిగిన పరిణామాలు జనసేనలో బీజేపీపై తమ వైఖరి మార్చుకునేలా చేశాయన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో జగన్ పట్ల మోదీకి, మోదీ పట్ల జగన్‌కు స్పష్టమైన అవగాహనతో ఉంటూ వస్తున్నారన్న అభిప్రాయం కూడా జనసేన నేతల్లో బలంగా నాటుకు వస్తోంది. అందుకు కారణాలు.. ఆ మధ్య ఏపీకి కేంద్రం రూ. 10వేల కోట్లపైగా ఏకమొత్తంలో నిధులు విడుదల చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకే కాదు, అనేక రోడ్డు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులకు ఆమోదం తెలిపింది. ఇవన్నీ జనసేనను ఆలోచనలో పడేసి ఉండొచ్చు. అలాగే రూట్‌మ్యూప్ అంశంలోనూ బీజేపీ నిర్లక్ష్యంగా వహించిందన్న అంశం పవన్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలాంటి అంశాలన్నీ జనసేన మైండ్‌సెట్‌ను మార్చి ఉంటాయని.. ఓవైపు తమతో పొత్తు సాగిస్తూనే.. వైసీపీకి బీజేపీ అండగా ఉండటం జనసేనకు నచ్చకే బీజేపీకి దూరంగా జరిగి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.
Admin