జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆరు నెలల్లో ఎన్నికలు జరగునున్న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగున్నరేళ్లలో చేసిన సంక్షేమం-అభివృద్ధి ఎజెండాగా మరోసారి ప్రజల్లోకి వెళ్తుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రతిపక్ష తెలుగు దేశం, జనసేన పార్టీలు పోటా పోటీ యాత్రలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు. సామాజిక సాధికార యాత్ర ద్వారా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే ఉన్న వైసీపీ కేడర్, తాజాగా ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతోంది. అక్టోబర్ 26 నుంచి 60 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. ఒక్కో రోజు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని మూడు ప్రాంతాల్లో మూడు నియోజకవర్గాల్లో యాత్రలు జరగనున్నాయి. మద్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీ సామాజిక సాధికార యాత్రకు సంబంధించి షెడ్యూల్ పార్టీ వర్గాలు విడుదల చేశాయి. అయా నియోజకవర్గాల్లో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సామాజిక సాధికారత,గత ప్రభుత్వం పేదల విషయంలో వ్యవహారించిన తీరును ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర వెళ్లే మార్గంలో ముందుగా నిర్ణయించిన చోట్ల ప్రజలతో మమేకం అవుతారు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తారు. సామాజిక సాధికార యాత్ర లో భాగంగా బస్సు పైనుంచే ప్రజల నుద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రసంగించనున్నారు. అక్టోబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సామాజిక సాధికార యాత్ర ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు,ఇతర నేతలు లాంఛనంగా ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పైనే స్పెషల్ ఫోకస్ సామాజిక సాధికార యాత్ర… పేరుకు తగ్గట్లుగానే బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసింది వైసీపీ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏవిధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, ప్రజలకు వివరించడమే యాత్ర లక్ష్యంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కేబినెట్‌తో పాటు ఇతర పదవుల్లోనూ భారీగా కేటాయింపులు చేయడం, ఆయా వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రను ఉపయోగించుకొనున్నారు వైసీపీ నేతలు. బస్సు యాత్రలో పేదలు పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ ఇప్పటికే నేతలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు-పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందనే నినాదాన్ని బస్సు యాత్ర ద్వారా బలంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీ నేతలు క్లాస్ వార్ స్లోగన్‌తో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేదంటే సమన్వయకర్తలు అధ్యక్షతన బస్సు యాత్ర జరగనుంది. ప్రతి బస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేశారు. సభలు ఎలా జరగాలి. ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశాలు పెట్టి వివరించారు. మొదటి విడతలో నవంబర్ 9 వ తేదీ వరకూ ఒక్కో రోజు మూడు ప్రాంతాల్లో యాత్రలు సాగనున్నాయి. బస్సు యాత్ర మొదటి విడత షెడ్యూల్ రిలీజ్ చేసిన వైసీపీ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వ తేదీ వరకూ మొదటి విడత సామాజిక సాధికార యాత్ర లు జరగనున్నాయి. దీనికి సంబందించిన పోస్టర్ ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు విడుదల చేశారు. మొదటి రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమ లో సింగనమలలో యాత్రలు జరగనున్నాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కోనసాగనుంది. జనంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మరోవైపు స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టై జైల్లో ఉండటంతో ఇప్పుడు ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు. చేయి చేయి కలిపి పోరాటం చేద్దామని ప్రజలకు భువనేశ్వరి పిలుపినిచ్చారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె నుంచి యాత్రను ఆమె ప్రారంభించారు. తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నిజం గెలవాలికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఆమె వెంట చిత్తూరు, తిరుపతి జిల్లాల టీడీపీ నేతలతో పాటు ఎమ్మెల్సీ అనురాధ, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు. నిజం గెలవాలి యాత్రలో పరామర్శలు.. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరిలో మరణించిన ప్రవీణ్‌రెడ్డి, నేండ్రగుంటలో కన్నుమూసిన చిన్నబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. వారి కుటుంబాలకు 3 లక్షల చెక్కు అందజేశారు. కష్టకాలంలో అండగా ఉన్న ప్రతీ ఒక్కరి బాధ్యత పార్టీ తీసుకుంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పరామర్శ తర్వాత చంద్రగిరిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు, రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని భువనేశ్వరి అన్నారు. తానెప్పుడు ఇలా బయటకు రాలేదని తెలిపారు. నిజం గెలవాలన్నది ఒక పోరాటమని తెలిపారు.
Admin