జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఎన్టీఆర్ వారసులు రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి రాజకీయాల్లో చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. ఇలాంటి పొలిటికల్ సీన్ చూస్తామని బహుశా నందమూరి వంశస్తులే ఊహించి ఉండరు. ఓవైపు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు అధికార పార్టీపై పురంధేశ్వరి ఏకంగా యుద్ధమే ప్రకటించారు. పురంధేశ్వరి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. నిజానికి, ఈ పరిస్థితిలో మాట్లాడుకోవాల్సింది భువనేశ్వరి గురించే. ఆమెకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ప్రభుత్వంలో ఉన్నా, పార్టీ వ్యవహారాలైన అన్నీ చంద్రబాబే చూసుకునే వారు. భువనేశ్వరి అటువైపుగా తొంగిచూసిన దాఖలాలు కూడా లేవు. చంద్రబాబు అరెస్ట్‌తో తప్పని పరిస్థితుల్లో భువనేశ్వరి బయటకు రావాల్సి వచ్చింది. టీడీపీలో చంద్రబాబు తరువాత ఆ స్థానం నారా లోకేశ్‌దే. అది ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చూసుకోవాల్సిందీ లోకేశే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నా, కీలక బాధ్యతల్లో ఇతర సీనియర్ లీడర్లు ఉన్నా.. లోకేశ్ ఏం చేస్తారు, ఎలాంటి వ్యూహాలు రచిస్తారనే దానిపైనే అందరి కళ్లూ ఉంటాయి. ఓవైపు చంద్రబాబు అరెస్ట్‌తో పార్టీలో యాక్టివిటీ బాగా తగ్గింది. పార్టీ ప్రజల్లోకి వెళ్లలేకపోతోంది. అరెస్టుపై పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు చేయలేకపోయింది. నిజానికి ఇదొక ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ లోకేశ్‌దే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు అంతటి వ్యక్తి అరెస్ట్ అయితే.. ప్రజల్లో ఎలాంటి చర్చ జరగాలి. అలా జరిగేలా చూడాల్సింది ఎవరు. లోకేశే కదా. లక్షల మందితో మానవహారాలు చేయించొచ్చు, రికార్డులు బద్దలయ్యేలా కార్యక్రమాలు చేయించొచ్చు. కనీసం రోడ్లపై వంటావార్పు లాంటి కార్యక్రమాలైనా చేపట్టొచ్చు. ఇవన్నీ ఒక ఉద్యమంలా సాగాలి. కాని, లైట్లు ఆర్పడం, కొవ్వొత్తులు వెలిగించడం, చప్పట్లు కొట్టడం వంటి కార్యక్రమాలతో అరెస్ట్ అనే అతిపెద్ద అంశాన్ని చాలా పలుచన చేశారు. లోకేశ్.. పార్టీని, కార్యకర్తలను సరైన డైరెక్షన్‌లో నడిపించలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే.. భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉండి పోతే, లోకేశ్ మాత్రం ఢిల్లీకి వెళ్లారు. న్యాయ నిపుణులతో సంప్రదింపుల పేరుతో 23 రోజులు అక్కడే ఉండిపోయారు. పోనీ నారా లోకేశ్ చర్చల వల్ల కేసులో ఏదైనా పురోగతి కనిపించిందా అంటే.. శూన్యం. ఒక్కసారి కూడా చంద్రబాబుకు ఊరట రాలేదు. అంటే.. అన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉండి లోకేశ్ చేసిందేంటి? అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. సరే.. ఢిల్లీలో జరపాల్సిన మంత్రాంగం జరపొచ్చు. కాని, రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను కూడా చూసుకోవాలిగా. కాని, అలా జరగలేదు. ఎంతసేపు పొత్తుల గురించే లోకేశ్ వెంటపడినట్టు కనిపించింది. పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటామనగానే.. అదే పదివేలు, ఇక పార్టీకి మేలు జరిగినట్టేనన్న ఫీలింగ్‌లో ఉండిపోయారు. నిజానికి జనసేన కంటే అత్యంత బలమైన పార్టీ టీడీపీ. కాని, చంద్రబాబు అరెస్ట్ తరువాత జనసేన బలం పెరిగింది.. అది కూడా కేవలం పొత్తు ప్రకటన వల్లే. అంత వరకు రావడానికి కారణం.. లోకేశ్ వ్యూహాత్మక తప్పిదమేనంటారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ డైరెక్షన్ మారుతోందన్న విషయం తెలిసింది కాబోలు భువనేశ్వరినే డైరెక్టుగా రంగంలోకి దిగారు. నిజానికి లోకేశ్ రాష్ట్రంలో లేనప్పుడు.. టీడీపీ నేతలందరూ వచ్చి కలిసింది భువనేశ్వరినే. చాలా మంది నేతలు ఢిల్లీ వెళ్లి లోకేశ్‌ను కలుద్దామన్నా వీలు కాలేదు. ఆ సమయంలో అరెస్ట్ చేస్తారన్న భయంతోనే లోకేశ్ ఢిల్లీ విడిచి రావడం లేదన్న ప్రచారం జరిగింది. ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఏ-14గా ఉన్నారు లోకేశ్. అందుకే, తాను ఎక్కడున్నానన్న విషయాన్ని పార్టీలో చాలా మందికి తెలియనివ్వలేదని చెప్పుకుంటుంటారు. సో, ఆటోమేటిక్‌గా పార్టీ బాధ్యతలను మోయాల్సిన బాధ్యత భువనేశ్వరిపై పడింది. చివరికి యువగళం వాలంటీర్లు జైలు నుంచి విడుదలై వస్తే.. వారిని ఓదార్చింది కూడా భువనేశ్వరినే. భీమవరం నియోజకవర్గంలోని గునుపూడిలో పాదయాత్ర సందర్భంగా 43 మంది యువగళం వాలంటీర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల రోజులుగా జైల్లో ఉన్న వాలంటీర్లు బెయిల్‌పై వస్తే వారందరినీ ఆత్మీయంగా పలుకరించింది భువనేశ్వరినే. పార్టీ బాధ్యతలు చూడాల్సిన లోకేశ్.. ఎలాంటి వ్యూహరచనలు చేయకుండా సైలెంట్‌గా ఉండిపోవడమే ఇందుకు కారణంగా చెబుతారు. మరోవైపు.. నేనున్నా, నేను చూసుకుంటానన్న బాలకృష్ణ కూడా కనిపించడం లేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో రెండు మూడు రోజుల పాటు బాలయ్య హడావుడి చేశారు. చంద్రబాబు స్థానంలో కూర్చుని ఒక సమీక్ష కూడా చేశారు. కాని, ఏనాడూ జనంలోకి వెళ్లలేదు. ప్రజల్ని కదిలించేలా ఒక్క ఆందోళన కూడా చేయలేదు. కనీసం కార్యకర్తలకు అండగా, వాళ్లకు మానసిక ధైర్యాన్నిచ్చేలా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఓవైపు ఏపీలో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ టీడీపీని తాను నడిపిస్తానంటూ హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ప్రెస్‌మీట్‌లో తెలంగాణ టీడీపీ గురించి మాట్లాడి.. ఇకపై తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఆ ఒక్క ప్రెస్‌మీట్ మినహా తెలంగాణ టీడీపీకి చేసిందేమీ లేదు. ఎప్పటిలాగే ఆయన సినిమాలు, ప్రొమోషన్లలోనే మునిగిపోయారు. పార్టీలో చెప్పుకోడానికి బోలెడంత మంది సీనియర్లు ఉన్నా ప్రజాసమస్యలపై పోరాడేవారే కరువైన పరిస్థితి. దీంతో తప్పని పరిస్థితిలో జనంలోకి వెళ్లారు భువనేశ్వరి. నిజం గెలవాలి పేరుతో యాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబు లేకుండా తిరుమలకు ఒంటరిగా వెళ్లడం, సొంత ఊరు నారావారి పల్లెలో అడుగుపెట్టడం తనకు చాలా భారంగా, బాధగా ఉందని చెప్పుకున్నారు భువనేశ్వరి. తన కష్టం అర్థమవుతోంది. పార్టీకి కష్టకాలంలో తానే ఓ ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి మరీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఓవైపు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూనే.. స్థానిక నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు అటెండ్ అవుతున్నారు. నిజానికి ఈ వ్యవహారాలన్నీ భువనేశ్వరికి అస్సలు తెలీదు. అయినా సరే.. సక్సెస్‌ఫుల్‌గానే చేస్తున్నారనే టాక్ అయితే వచ్చింది. సభల్లో కూడా పేపర్‌పై పాయింట్స్ పెట్టుకుని చూసి చదవకుండా స్వతహాగా, ఆ క్షణానికి అనిపించింది మాట్లాడేస్తున్నారు. ఒకవిధంగా చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే టీడీపీ నినాదాన్ని లోకేశ్, బాలకృష్ణ కంటే.. భువనేశ్వరినే ఎఫెక్టివ్‌గా తీసుకెళ్తున్నారన్న టాక్ వస్తోంది. 45 రోజులకు పైగా చంద్రబాబును బంధించి ఉంచారంటూ ప్రజలకు వివరించి చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు అరెస్ట్ వార్త విని చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే బాధ్యత బాలకృష్ణ తీసుకుంటానన్నారు. ఆయన ఏ పని ఒత్తిడిలో ఉన్నారో తెలీదు. లోకేశ్‌కు కూడా పరామర్శకు మించిన పనులు ఉన్నాయేమో కాబోలు. అందుకే, నిజం గెలవాలి పేరుతో బయటకు వచ్చారు భువనేశ్వరి. మొత్తానికి, ఎన్టీఆర్ వారసురాలిగా ఇలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు భువనేశ్వరి. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను, ఆయన చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకున్నారు మరోవైపు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని ఎప్పటి నుంచో ముందుకు తీసుకువెళ్తున్నారు పురంధేశ్వరి. ఈ మధ్య మరీ దూకుడు పెంచారు. ఆ మాటకొస్తే.. నారా లోకేశ్‌కు అతిపెద్ద సాయం చేసిందే పురంధేశ్వరి అని చెబుతుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం రోజుల తరబడి ఢిల్లీలోనే ఉండి ప్రయత్నించినా.. నారా లోకేశ్‌కు ఓ పది నిమిషాలు కూడా అమిత్‌షాతో మీటింగ్ సాధ్యం కాలేదని టాక్. ఇక చేసేది లేక రాజమండ్రికి తిరిగి వచ్చేస్తే.. ఆ బాధ్యతను పురంధేశ్వరి తీసుకున్నారని పొలిటికల్ సర్కిల్‌లో టాక్. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఒప్పించి, ఆయన ద్వారా అమిత్‌షాతో నారా లోకేశ్‌కు అపాయింట్‌మెంట్ దొరికేలా చేశారనేది బయట చెప్పుకుంటున్న మాట. నారా లోకేశ్ కోసం పురంధేశ్వరి ఇంత కష్టపడ్డారని చెబుతుంటారు. ఆ విషయం పక్కన పెడితే.. పార్టీని కాస్త దూకుడుగానే నడిపిస్తున్నారు పురంధేశ్వరి. వచ్చీ రాగానే సర్పంచ్‌ల సమస్యలపై పోరాటం చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రజల్లో ఫోకస్ పెంచే ప్రయత్నం చేశారు. కార్పొరేషన్లు, రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి కూడా విజ్ఞప్తి చేశారు. అంటే ఈ విషయంపై పురంధేశ్వరి ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్ధమవుతోంది. అప్పులపై పోరాటం కొనసాగిస్తూనే మద్యం అమ్మకాలపైనా, మద్యం నాణ్యతపైనా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మద్యం తయారు చేసే డిస్టలరీస్ యాజమాన్యాల వివరాలు బయటపెట్టాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇప్పుడు మద్యం తయారీ, అమ్మకాల విషయంలో డైరెక్టుగా తాడేపల్లినే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏపీలో మద్యం అమ్మకాలతో 56వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కేవలం 20వేల కోట్ల ఆదాయమే వస్తోందని చెబుతోందంటున్నారు పురంధేశ్వరి. మిగిలిన ఆ 36వేల కోట్ల మద్యం ఆదాయం తాడేపల్లికి వెళ్తోందంటూ డైరెక్టుగానే విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ స్మారక నాణం విడుదల కార్యక్రమ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నది కూడా పురంధేశ్వరే. మొత్తానికి అటు భువనేశ్వరి, ఇటు పురంధేశ్వరి.. ఎన్టీఆర్ వారసురాళ్లుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. అది కూడా ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఇలా ఒకేసారి వైసీపీపై సమర భేరీ మోగించడాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు నందమూరి అభిమానులు. వారసులుగా లోకేశ్‌గానీ, బాలకృష్ణ గాని చేయలేని రాజకీయాలను పురంధేశ్వరి, భువనేశ్వరి చేస్తున్నారనేది కొందరు విమర్శకుల అభిప్రాయం.
Admin