జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఎక్కడైనా పేకాట, మట్కా నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవడం చూశాం. కానీ అనంతపురం జిల్లా ఎస్పీ ఏకంగా పోలీసులు పైనే చర్యలు తీసుకున్నారు. పేకాట, మట్కా నిర్వాహకులతో చేతులు కలిపి, డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న పోలీస్ సిబ్బందిపై అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ నిఘా పెట్టారు. పేకాట, మట్కా స్థావరాలు ఎక్కడ ఉన్నాయో తెలిసినా.. సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తూ.. వారితో చేతులు కలిపిన 9 మంది పోలీసులపై కొరఢా ఝుళిపించారు అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగు నిర్వాహకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న 9 మంది పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తోంది. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టం.. చట్ట వ్యతిరేక శక్తులతో పోలీసులు సన్నిహిత సంబంధాలు కొనసాగించి.. పోలీసు ప్రతిష్ట దిగజారిస్తే ఊరుకునేది లేదంటూ ఎస్పీ అన్బురాజన్ హెచ్చరిస్తున్నారు. కళ్యాణదుర్గం, గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, ఐదుగురు కానిస్టేబుళ్లకు పేకాట, మట్కా నిర్వాహకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలడంతో విఆర్ కు పంపించారు. అదేవిధంగా డిఎస్పి స్థాయి అధికారితో ఈ తొమ్మిది మంది పోలీసు సిబ్బందిపై విచారణకు ఆదేశించారు. మరోవైపు తాడిపత్రి, అనంతపురం అర్బన్, అనంతపురం రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందిపై కూడా నిఘా పెట్టామన్నారు ఎస్పి అన్బురాజన్. ఒకేసారి 9 మంది పోలీసు సిబ్బందిపై ఎస్పీ చర్యలు తీసుకుని వి ఆర్ కు పంపటం జిల్లా పోలీసు యంత్రాంగంలో కలకలం రేపుతుంది. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీస్ సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్.
Admin