జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : అదొక ప్రభుత్వ కార్యాలయం.. కానీ అక్కడ అధికారుల కంటే ప్రైవేట్ వ్యక్తులే చాలా యాక్టివ్ అట..! వాళ్ల చుట్టూనే వ్యవహారాలన్ని సాగిపోతాయట.. అధికారులను కూడా నడిపిస్తున్నది వాళ్లే నట..! ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట అయినప్పటికీ.. తాజాగా జరిగిన వ్యవహారం ఆ మాటలను అక్షరసత్యం చేశాయి. ఏసీబీ అధికారుల మెరుపు సోదాల్లో.. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సహా సబ్ రిజిస్టార్ పట్టుబడ్డాడు. ఇంతకీ ఏసీబీ అధికారులకు ఆ కార్యాలయం పైనే ఎందుకు అంత నిఘా..? అక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏంటి..? విశాఖలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో జాయింట్ సబ్ రిజిస్టార్ 2 కార్యాలయం ఉంది. అక్కడ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తూ ఉంటారు. నిత్యం పదుల సంఖ్యలో కక్షిదారులు అక్కడకు వచ్చి తమ పనులు చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్ లు, డాక్యుమెంట్ పనులతో ఆ ప్రాంతమంతా బిజీబిజీగా ఉంటుంది. ఆఫీసులో సిబ్బంది ఉన్నా.. అంతా నడిపించేది మాత్రం డాక్యుమెంట్ రైటర్ లే. ఎందుకంటే నేరుగా అధికారుల దగ్గరకు వెళ్తే పని జరగదు అన్నది చాలా సందర్భాల్లో అక్కడకు వెళ్లిన జనాలే చెప్పేవారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్తే తొందరగా పూర్తవుతుంది. కాకపోతే కాసులు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి.. డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో అక్కడున్న అధికారులు జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు పుష్కలంగా బయటకు వస్తున్నాయి. ఆరు నెలల క్రితమే ఆఫీసులో ఏసీబీ తనిఖీలు.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ట్రాన్స్‌ఫర్.. – అంతా అధికారుల కనుసనల్లోనే జరిగిపోతూ ఉంటుంది. నేరుగా అధికారులు డబ్బులు తీసుకుంటే వ్యవహారాలు బయటపడిపోతాయన్న నెపంతో.. షాడో పవర్స్ అంతా డాక్యుమెంట్ రైటర్ లకే ఇచ్చేశారట . దీంతో అక్కడ మూడు ఫైల్లు, ఆరు పచ్చ నోట్లు గా సాగిపోతోంది లంచాల వ్యవహారం. ఈ కార్యాలయం పై భారీగా ఆరోపణలు ఫిర్యాదులు అందడంతో.. ఆరు నెలల క్రితమే ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏప్రిల్ 28న జరిపిన తనిఖీల్లో.. లక్షకు పైగా అనధికారిగా నగదును గుర్తించి సీజ్ చేశారు. డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా కొంత నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజి కి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. అక్కడ జరుగుతున్న అవినీతి వ్యవహారాన్ని ఆలేఖలో పొందుపరిచారు. దీంతో ఇద్దరు సబ్ రిజిస్టర్ లను అక్కడ నుంచి పొందూరు, రాజాం లకు బదిలీ చేశారు.
Admin