జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్‌ను విశాఖకు షిఫ్ట్ చేస్తున్నారు. ఈ నెల 24న ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 16వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన అంతటా ఆసక్తికరంగా మారింది. అయితే ఆరోజు ముఖ్యమంత్రి రిషికొండ ఐటి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటైన ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను సందర్శించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఆ రోజు నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించనుంది. వాస్తవానికి విజయదశమి రోజే ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని క్యాంపస్‌ను ప్రారంభించాలని ముందుగా అనుకున్నారు.. కానీ 16వ తేదీకి క్యాంపస్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని.. ఆ రోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభించడానికి రెడీగా ఉన్నామని ఇన్ఫోసిస్ కార్యాలయం తెలిపింది. దీంతో ఒక వారం పాటు కార్యకలాపాలు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో.. ఈనెల 16న ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి విశాఖ వచ్చేందుకు అంగీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ఆరోజు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు. పలుమార్లు ప్రారంభోత్సవం వాయిదా.. వాస్తవానికి ఈ ఏడాది జూలై 1 నుంచే విశాఖపట్నంలోని రుషికొండలోని ఐటీ-సెజ్‌లో.. ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ప్రారంభించాలని అనుకుంది. కానీ సరైన క్యాంపస్ దొరకక ఆలస్యం అయింది. కోవిడ్ తర్వాత ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఎక్కువమంది వర్క్ ఫ్రమ్ హోం గానే పని చేస్తున్నారు. అలా కాకుండా, ఆఫీస్ నుండి పని చేయడానికి సిబ్బందిని సిద్ధం చేసే ప్రయత్నంలో టైర్ – 2 నగరాల్లో క్యాంపస్‌ల ఏర్పాటుకు ఇన్ఫోసిస్ సిద్దమైంది. ఆ స్ట్రాటజీ లో భాగంగానే జూలై 1న విశాఖపట్నం కార్యాలయం నుంచి ఐటీ దిగ్గజం తన కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ సరైన వసతులు ఉన్న క్యాంపస్ దొరకలేదు. మొదట వేరే కమర్షియల్ క్యాంపస్‌లో లక్ష చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటుకు సిద్దం అయినా.. ప్రత్యేక క్యాంపస్ ఉంటే బాగుంటుందని భావించి ఆ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదట 1400 మంది, తర్వాత 3 వేల మంది పనిచేసే విధంగా క్యాంపస్ నిర్మాణం.. కోవిడ్ తర్వాత విశాఖ పరిసర ప్రాంతాల్లో 1,400 మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్టు గుర్తించింది ఇన్ఫోసిస్. మొదట వారందరినీ క్యాంపస్ నుంచి పని చేసే విధంగా ఏర్పాట్లు చేపట్టింది. వీరంతా ఇకపై విశాఖపట్నం ఇన్ఫోసిస్ క్యాంపస్ నుంచి రెండు షిఫ్టులలో పని చేయనున్నారు. అయితే ఇన్నాళ్లూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడ్డ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఓ ప్రణాళికను రూపొందించింది. ఒకేసారి నేరుగా ఆఫీస్‌కు రమ్మంటే కష్టం అని ఎవరైనా భావిస్తే.. మొదటి దశలో తమ ఉద్యోగులు వారానికి రెండు రోజులు హాజరైతే సరియేలా ప్రణాళిక రూపొందించింది. రెండవ దశలో వారి సౌకర్యాన్ని బట్టి అవసరమైతే వారికి ఇష్టమైన క్యాంపస్ నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తుంది. ఇక మూడో దశలో మొదటి రెండు దశల ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ఇన్ఫోసిస్ హైబ్రిడ్ వర్క్ పాలసీని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నట్టు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం.. వాస్తవానికి కోవిడ్ తర్వాత టైర్ 2 పట్టణాల్లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగులను ఆఫీస్‌కు పిలిపించేందుకు ఈ తరహా క్యాంపస్‌లను విశాఖ తో పాటు భోపాల్, కోయంబత్తూరులో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది ఇన్ఫోసిస్. అయితే విశాఖను ప్రతిపాదిత రాజధానిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. బీచ్ సిటీలో బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఐటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ముందుకు వస్తే మరిన్ని ప్రసిద్ధి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖకు వస్తాయన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించాలని స్థానిక యంత్రాంగానికి కూడా సూచించింది. స్వయంగా ముఖ్యమంత్రి హాజరై ఆ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటే.. దేశం మొత్తం మీద దానికి సంబంధించిన ప్రచారం జరిగే అవకాశం ఉంది. తద్వారా మిగతా కంపెనీలను ఆకట్టుకునేందుకు అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకొని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌ను విశాఖకు షిఫ్ట్ చేసే వారం ముందు.. వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ప్రారంభించడానికి పట్టణానికి రాబోతున్నారు.
Admin